Wednesday, November 26, 2014

నెట్టివేయబడ్డప్పుడు 
త్రోసి వేయబడ్డప్పుడు 
అణచివేయబడినప్పుడు 
తృణీకరించబడ్డప్పుడు 
సమాజం దూరంగా ఉంచి నీకు దేవుడు లేడన్నప్పుడు 
ఆయన వచ్చాడు
కేవలం నా కోసం వచ్చాడు
నా లాంటి వాళ్ళ కోసం వచ్చాడు 

చీకటిలో నడిచే జనులకు గొప్పవెలుగుగా
మరణచ్ఛాయగల దేశ నివాసుల మీద ప్రకాశించే వెలుగుగా
గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి
బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తేవడానికి
చీకటిలో నివసించే వారిని బందీగృహములోనుండి
వెలుపలికి తెచ్చి జీవమవడానికి
ఆయన వచ్చాడు

ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు
తల్లికడుపులో పిండమై , మాంసమై , మనిషై
లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లై వచ్చాడు

దేవుడు లేని నాకు దేవుడైయ్యాడు
దేవుడే నాకు స్నేహితుడయ్యాడు
నన్ను తనలో ముద్రించుకున్నాడు
నా పాపాన్ని సిలువకు కొట్టి
పరమ రాజ్యానికి నన్ను వారాసురాలిని చేసాడు

నా తలపైకెత్తాడు
నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన కొండపై
నన్ను నిలబెట్టాడు
తన చేతులలో నన్ను చెక్కుకున్నాడు

Wednesday, October 22, 2014

| నా దీపమును వెలిగించువాడు | Mercy Margaret 
--------------------------------------------------------------
నీ గురించి పాడటానికి నా దగ్గర ఒక్క కొత్తపాట లేదు 
నీ గుమ్మంలో ప్రవేశించక ముందు 
వెలుగునదిలో నువ్వు నన్ను ముంచి తీసాకా 
పాతపాటలతో నిన్నెలా చేరను ?

నా దారిపొడవునా 
చెట్లకొమ్మలు రోజూ కొత్తపాటలను 

పూయించి నీ సన్నిధికి పంపడం చూసాను
ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలను
రోజూ ఓ కొత్తపాటతో వెలిగించడం చూసాను
నీ పేరు రాసున్న ప్రతి చోట కొత్త సంగీతం నదులై
ప్రవహించడం చూస్తున్నాను
అంతేనా
తల్లి పిచ్చుక తన చిట్టిపిచ్చుకకు నీ స్తుతికీర్తన
నోటికందిస్తుంటే
నా నోట ఏ పాట లేదని చింతిస్తూ వచ్చాను

నీ గుమ్మంలో ప్రవేశించాక
తేజోమూర్తి ..!!
కోటిసూర్యప్రకాశుడా ..!!

నా మనో నేత్రాలు వెలిగించబడ్డ క్షణాన
కొత్త పాటొకటి నాలోంచి ఇప్పుడే పుట్టింది
కొత్త రాతిని
కొత్త పేరొకటి నువ్వు నాకిచ్చిన ఈ క్షణాన
వెలుగువై నీవు నాలో నిండిన క్షణాన ఇప్పుడే తెలిసింది
నీ సన్నిదే నాకు దీపావళని
నీవు నాతో ఉన్న ప్రతి క్షణం
నే దీపమై వెలుగొందుతానని .

-------------- 22/10/2014 -----------


2కోరింథీయులకు 4:5 _"అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను."
ఎఫెసీయులకు 5:9 _"వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది."

Thursday, July 3, 2014

| బలమైన దుర్గము| Mercy Margaret
----------------------------
నీ పేరుందంటావ్ నాకు తెలుసు..!

అందరూ విడిచి 
చీకటి ముసురుకునే వేళ

ఏ అరణ్యమో తెలియని చోటు నుండి
భయంకర శబ్ధాలు వినవస్తూ
ఒంటరిగా ఉన్న గుహలో
నా ఎదురుగా పేరు తెలియని 
జంతువులు హేళనగా
ఆకలిగా తిరిగే వేళ

నీ పేరుందంటావ్
నాకు తెలుసు..!

ఎవరూ కట్టలేని అధ్బుతమైన
కోట
ఎవరూ ఎక్కలేని ఎత్తైన కొండ
బాహువులు చాచి ఎదురు చూసే
నీ పేరే నాకు ఆశ్రయమవ్తుందని
నువ్వు ముందే చెప్పావ్

అయినా నా చెవుల్ని
మనసుని స్వాదీనం చేసుకున్న
దుష్టుడిని ఈ క్షణమే
నీ నామంతో ఓడించి
హృదయం చేతిలోకి తీసుకుని నీ పేరులోకే
వస్తున్నా
నువ్వే నా ఎదురుగా ఉన్నాక
వినలేని చెవులు నాకెందుకు?

------------ (10/5/2014)---------------

సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.

కీర్తనలు 31:3 నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే.
 

Saturday, May 17, 2014

|మేఘా రూఢుఢ రమ్ము| Mercy Margaret
------------------------------------
చీకటి ముంచుకొస్తుంది
భయం తరుముకొస్తుంది
ఈ దేశం నాదికాదని
నా అస్థిత్వం కోసం చేస్తున్న యుద్దాన్ని
గేలిచేస్తూ వెక్కిలిగా నవ్వుతుంది

ఓట్లకోసం సెక్యులర్ ముసుగు తొడిగిందేమో
అక్కడక్కడ చినిగిన ముసుగులోంచి
నా వాళ్లను నిలువునా కాల్చిన దృశ్యాలు
కత్తిపోట్లతో నిట్టనిలువునా చీల్చిన
రక్తపు చారలు కనిపిస్తున్నా
అమాయకత్వాన్ని
కొని, ముఖానికి అంటించుకుంటున్న దాన్ని
నమ్మిన
నా తోటి గొర్రెలకు
రాబందదని ఎలా చెప్పాలి

నా గొంతుకు వోట్ల కోసం చేసిన
తోడేల్ల గాయాలు
సమూహంగా నన్ను అంతం చేయాలని
వారు అరిచే అరుపుల్లో
నేను మీ మట్టి వాన్నే
నా ఉనికి ఈ నేలదే
మీరంతా నా మనుషులే అన్న
నా గొంతెందుకో వారికి వినబడదే??

చీకటి ముంచుకొస్తుంది
భయం తరుముకొస్తుంది
ఈ దేశం నాది కూడా అని అరిచే కొన్ని
శరీరాలు తగలబడుతూ
రక్తం చిందించనీ ....!
విత్తనాల్లా మారుతున్న వారి తెగువ వెనక
విస్తారంగా ఎదిగే పంటను త్వరలోనే
చూస్తారు
చీకటిని చీలుస్తూ
మధ్యాకాశంలోకి
కొదమసింహం తిరిగిరాబోతుంది

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, 
ఆయనను పొడిచినవారును చూచెదరు; 
భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.!!!!
-------------------------- ( 17/5/2014)-----------------

Saturday, January 11, 2014

|| నాతో నేనుకాసేపు || By mercy margaret
-----------------------------------------------------
ఎన్ని ఉదయాలో
ఎన్ని ఆలోచనలో
ఎన్ని ఆప్యాయతల మేలుకొలుపులో

ఒక్కో రోజు వెనకేసుకుంటూ ముందుకెల్తూ
మళ్లో ఉదయాన్నే తిరిగి దేహంలోకి 
ప్రవహించి

నిద్రలోంచి తెరచిన కళ్లతో
ఒక నిమిషం శూన్యంలోకెళ్లి

ఈ రోజెంత ఖరీదో నన్ను నేను
ప్రశ్నించుకుని
చేతులు మోడ్చి
మోకరిళ్లి
ఆత్మతో పరిశుద్ధాత్మ దర్శనం చేస్తూ

ఈ రోజునీ ఉపయోగించే
తెలివిమ్మని అడుగుతూ

నేను కేవలం
మనిషినని గుర్తు చేసుకుంటూ

నాలో నేను
నాతో నేనుకాసేపు

ఉదయాలు చీకట్ల
వలయాలు వక్ర రెఖల వెనక
తీరాల అంచుల కోణాల వెనక
నా ఉద్ద్యేశం వెత్తుకుంటూ

ఆయన దక్షిన హస్తాన్ని స్పృశిస్తూ
నేనెంటో ఎవరో తెలుసుకుంటున్నా
మహిమ రాజ్యానికై సిద్ధపడుతున్నా

--------------- by mercy margaret
సంతోషాన్ని ఫోటో తీసే ప్రయత్నంచేసి ఓడిపోతుంటే 
సంతోషం అన్ని రెట్లెక్కువవుతుంది ఏంటో??

అప్పుడే ఆయన ముఖంవైపు తేరి చూస్తా..!!
కన్నీటికి ప్రతిగా ఆనందతైలాన్ని
బూడిదకి ప్రతిగా పూదండనీ
చేతుల్లోకిస్తూ
నన్ను నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు

ఆయన మృదువైన హస్తాల్లో నన్ను చెక్కుకున్న
తావు చూపిస్తూ
నేనాయనకు ఎప్పుడూ ప్రత్యేకమైన దాన్నని
ప్రేమగా హత్తుకుంటాడు

అప్పుడు ఆకాశం నవ్వుతూ
నన్ను ఆయన్నీ ఫోటో తీస్తుంది
సంతోషం ఆయన రూపమై కనిపిస్తుందప్పుడు నాకు
అచ్చం ఇప్పుడు కనిపిస్తున్నట్టే.........
_________________(17/12/2013)
||దేవుడు ఎక్కడా??||
_________________________

దేవుడు ఎక్కడా??అని అడిగే ప్రతొక్కరికి


దేవున్ని చూపించలేను

అలా అని నవ్వుకోకండి..!!



దేవుడే పంపుంటాడనే

కొన్ని అధ్బుతమైన వాటిని మాత్రం


చూపించగలను

అడగ్గానే సహాయం చేసే చేతులు

కష్టాల్లో భాదల్లో తనివి తీరాఎడ్చేందుకు


సిద్ధంగా ఉండి


హత్తుకునే భుజాలు


కన్నీళ్లను తీసుకుని నవ్వుల్నిచ్చే పెదవులు

ఎప్పుడూ నా చుట్టూ సిద్ధంగా ఉంటాయి

వీటిని మాత్రం ఎవరు ఇవ్వగలరు

దేవుడు తప్పితే..?
_____________(4/12/2013)___